తడి – పొడి చెత్తపై అవగాహన: మార్పు దిశగా ముందడుగు

viswatelangana.com
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, చెత్తను తగిన రీతిలో వేరు చేయడం మరియు మళ్లీ ఉపయోగించుకునే పద్ధతులను ప్రోత్సహించేందుకు కోరుట్ల మున్సిపాలిటీ విశేషంగా ముందుకొచ్చింది. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ నాయకత్వంలో 100 ప్రణాళిక లో భాగంగా మంగళవారం రోజున కోరుట్ల పట్టణవ్యాప్తంగా తడి, పొడి, హానికర చెత్తలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రజలకు హోమ్ కంపోస్టింగ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్) వాడకంపై నిషేధం వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం అందించారు. ఐ.ఈ.సీ. (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమం కింద ఇంటింటికీ పోస్టర్లు అతికించి అవగాహన కల్పించడమే కాక, పలువార్డులలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లలో పూడిక తొలగింపు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండీ వచ్చే చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేసి, తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలి డబ్బాలో వేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని అన్నారు. తడి చెత్తను కంపోస్ట్ కేంద్రానికి తరలించి ఎరువుగా తయారు చేయడం జరుగుతుందని, పొడి చెత్తను డి.ఆర్.సి.సి కేంద్రానికి పంపుతామని తెలిపారు. అలాగే, ప్రజలందరూ తమ ఇంటి నుండి వచ్చే చెత్తను సక్రమంగా వేరు చేసి, సమాజ హితానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మెప్మా టీమ్ సభ్యులు, టీఎంసీ శ్రీరామ్ గౌడ్, వార్డు అధికారులు, సీఓలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



