యువత ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతి, యువకులకు ఆర్థిక అక్షరాస్యత మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు, బీమా సదుపాయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్.ఎల్.సి కోట మధుసూదన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయని ఆన్లైన్ ఆప్ లను నమ్మి యువత మోసపోవద్దని, చిన్న తరహా, స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ పొందిన యువతి,యువకులు ముద్ర వంటి బ్యాంక్ లోన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జన సురక్ష, పీఎం విశ్వకర్మ, ముద్ర, పీఎంఈజీపీ, పీఎం జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన,పీఎం ఎఫ్ఎంఈ,రాజీవ్ యువ వికాస్ వంటి పథకాలను వినియోగించుకుని రుణాలు పొంది వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అర్హులైన వారు రుణాలు పొంది ప్రభుత్వాలు అందించు వివిధ రకాల బీమా సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిరిమల్లె నరేష్, జిఎంఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, జిఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు.



