కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆశయ సాధకులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. 1857 సిపాయీల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలు కొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలర్పించి, స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి, సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని, స్వాతంత్ర్య పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు సంస్కర్త భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలని జువ్వాడి నర్సింగరావు అన్నారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బాధ్యతను సరిగ్గ నిర్వర్తించకపోగా, పేదలకు అందించే సంక్షేమ పథకాలకు “ఉచితాలు” అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని అన్నారు. భారతదేశ సహజీవన సౌభ్రాతృత్వ విలువల పరిరక్షణ కోసం మనం మరొక్కసారి ప్రతినబూనుదాం స్వాతంత్య్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ముందుకు పోదామని ఆశాభావం వ్యక్తం చేసారు. కొందరు మత చిచ్చురేపి, ఇంకా రేపాలనీ శాంతిని సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనీ తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ, విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దీన్ని మేధావి లోకం యువకులు, విద్యార్థులు ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్విట్లు పంపిణీ చేసుకొని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జువ్వాడి నర్సింగ్ రావు, జువ్వాడి కృష్ణారావులు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళు, వివిధ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల పట్టణ, మండల నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



