రాయికల్

గడపగడప తిరుగుతూ బిక్షాటన చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన

viswatelangana.com

March 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.గత మూడు నెలల నుండి జీతాలు అందకపోవడంతో ముప్పుతిప్పలు పడుతూ… శనివారం రాయికల్ మండల కేంద్రంలో ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు గడపగడప తిరుగుతూ బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.గత మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబాలను పోషించలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నిత్యం గ్రామాలలో కూలీలకు పనులపై అవగాహన కల్పిస్తూ పని ప్రదేశంలో కూలీలకు కొలతలు ఇస్తూ మస్టర్లలో పనులకు హాజరైన కూలీల హాజరు వేస్తూ,ఆన్లైన్ లో హాజరు పంపిస్తున్నామని,అయినా మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు ఇస్తున్న ప్రభుత్వం నిత్యం గ్రామాలలో కూలీలకు పనులు కల్పిస్తూ కూలీల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న తమకు ఎందుకు జీతాలు నెలనెలా ఇవ్వడం లేదని మనోవేదన చెందుతున్నారు.ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. నెలనెలా జీతాలు ఇవ్వకపోవడం వల్ల పిల్లల బడి ఫీజులు చెల్లించక,నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉందని,ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి తొందరగా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధిహామీ పథకంలో అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందపరిచిన విధంగా పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని,పెండింగ్ లో ఉన్న జీతాలు తొందరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ మండల అధ్యక్షులు భూక్య తిరుపతి,కనికరపు లక్ష్మణ్, మహమ్మద్ నషీర్,మామిడిపెల్లి మహేష్, నర్సయ్య,మల్లేశం,లక్ష్మణ్, ఇందూరి తిరుపతి, శ్రీనివాస్, తిరుపతి, రాజేందర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button