
viswatelangana.com
అంబేద్కర్ ను అవమానపరిచిన ఎమ్మెల్యేను వెంటనే పదవి నుండి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్, ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గ టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్లెక్సీ ని తీసివేసి, ధ్వంసం చేసి అవమానపరిచారని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రస్తుత ప్రజాప్రతినిధులందరూ ఎన్నికయ్యారని గుర్తు చేసారు. ఎమ్మెల్యే గా ఉండి కూడా అంబేడ్కర్ ను అవమానపరచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేను పదవి నుండి తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసి కఠిన చర్య తీసుకోకపోతే ఏపీలో టీడీపీ పార్టీ పైన తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన, అవమానపరిచిన వ్యక్తులను వెంటనే ఉరితీయాలని, దేశంలో అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, అంబేడ్కర్ ను అవమానించే మూర్ఖులకు తగిన శిక్షలు పడే విధంగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేసారు. ఎమ్మెల్యేను వెంటనే పదవి నుండి తొలగించి, ఆయనపై ఏస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, పసుల కృష్ణ ప్రసాద్, సామల వేణుగోపాల్, సంగం దేవయ్య, ఎడ్ల ప్రభాకర్, బాపురపు సంజీవ్, ఉయ్యాల విజ్ఞాన్, ఉయ్యాల మాదేశ్, అబ్బ దిగ్నేష్, దామ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.



