Local

కరెంట్ కట్ చేస్తే చర్యలు తప్పవు..సీఎం

విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం

viswatelangana.com

February 22nd, 2024
Local (విశ్వతెలంగాణ) :
  • ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ, కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.

Related Articles

Back to top button