గాలికుంటు నివారణ టీకాలు
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో సుమారు 390 పశువులకు, సింగరావుపేట గ్రామంలో 170 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు అదనపు పశు వైద్య శస్త్ర చికిత్సకులు డాక్టర్ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాధి ప్రధానంగా వ్యాధి గ్రస్త జీవాల నుండి ఆరోగ్యమైన జీవాలకు సోకుతుంది. ఈ వ్యాధికి కారణమైన వైరస్ వ్యాధి గ్రస్త జీవాల లాలాజలంలో, విసర్జితాలలో ఉంటుంది. పశువులను రవాణా చేసే సమయంలో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులలో జ్వరం 103 నుండి 105 F వరకు ఉంటుంది. నోటిలో మరియు కాలి గిట్టలలో పుండ్లు ఏర్పడుతాయి. వ్యాధి సోకినపుడు చూడి పశువులు ఈడ్చుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. పాల దిగుబడి గణనీయంగా తగ్గి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. అశ్రద్ధ చేసినపుడు వ్యాధి ముదిరి పశువు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి గ్రస్త పశువులను వేరు చేసి యాంటీబయాటిక్, అంటి ఇన్ఫ్లమేటరీ, బలపు మందులను పశు వైద్యుని చేత తగిన చికిత్స చేయించాలి. మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని డాక్టర్ నరేష్ రెడ్డి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్లు ఎలిగేటి రవీందర్, వెటరినరీ అసిస్టెంట్ కట్కం రమేష్, కార్యాలయ సహాయకులు షేక్ అహ్మద్, తలారి బక్కయ్య, అనిల్, పోచయ్య, రైతులు వెంకట సుబ్బారావు, వెంకటేశం, మందుల రాజాం, మందాటి కొమురయ్య, రాజేష్, రవి, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



