
viswatelangana.com
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో చేరెందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆసంఘం నాయకులు తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పట్ల జర్నలిస్టుల్లో కనబడుతున్న ఆదరణ చూసి కుంభకర్ణ నిద్రలో ఉన్న కొన్ని సంఘాల నాయకులు నిద్రలేచి జర్నలిస్టుల చెంతకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల ఐబి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో కోరుట్ల ప్రెస్ క్లబ్, మన కోరుట్ల ప్రెస్ క్లబ్ లకు చెందిన సుమారు 40 మంది జర్నలిస్టులు డబ్ల్యూజెఐలో చేరెందుకు నిర్ణయించారు. కోరుట్ల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉరుమడ్ల శ్రీనివాస్ డబ్ల్యూజేఐ లో తమ చేరికను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నాయకుడు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ… ఆరు దశాబ్దాలు జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న సంఘాలు గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయని విమర్శించారు. గ్రామీణ జర్నలిస్టుల వేతన వ్యవస్థ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు తమ సంపాదకత్వంలో, నేత్రుత్వంలో ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతన వ్యవస్థను ఎందుకు అమలు చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సంఘాలకు అతీతంగా జర్నలిస్టులందరికీ న్యాయం జరిగే విధంగా సంక్షేమ, ఇతర పథకాల అమలుకు సంబంధించి సమగ్ర విధానం రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో సంఘాల గుత్తాధిపత్య ధోరణికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలోని యావత్ జర్నలిస్టులు ఒకే సంఘం గొడుగు నీడలో లేరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. గ్రామీణ జర్నలిస్టుల వృత్తి భద్రత, ఆరోగ్య బీమా, అక్రిడిటేషన్లు నివేషణ స్థలాల విషయంలో, కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిసి ఉచ్చమించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల విషయంలో ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవించాలని, జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో మీడియా అకాడమీ పెత్తనానికి స్వస్తిపలకాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు న్యాయం జరిగేలా సమాచార మంత్రిత్వ శాఖ నేరుగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిట్టపెళ్లి రమణ, నటరాజ్, విజయ్ పాటిల్, శంకర్, నాగరాజ్, గంగాధర్ కొటేస్, ప్రేమ్, పాత్రికేయులు పాల్గొన్నారు.



