విశ్వశాంతి లో ముందస్తు ఉగాది వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.పాఠశాల యాజమాన్యం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థినీ విద్యార్థులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ పచ్చడిలో ఉన్న ఆరు రుచులు మనిషిలోని ఆరు అనుభూతులను తెలియజేస్తుంది.ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారు, రజిత సంజన, ఇందూజ, శృతి, శ్రీజ మనీషా, మమత, అపర్ణ, స్రవంతి, ప్రత్యూష, రాజ్యలక్ష్మి, మమత, సహస్ర తదితరులు పాల్గొన్నారు.



