కోరుట్ల

సమాజ సంస్కారానికే పురాణాలు – బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరిశర్మ

viswatelangana.com

July 4th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

వేదవ్యాస మహర్షి జాతికి అందించిన అష్టాదశ పురాణాలన్నీ సమాజ సంస్కారం కోసమేనని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన అష్టాదశ మహా పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3వ కార్యక్రమం ‘శ్రీ నారద మహా పురాణం’ శుక్రవారం కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో ప్రారంభమైంది. సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, నిర్వహణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్ మొదట గురువందన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమితి సాంస్కృతిక కార్యదర్శి పిన్నంశెట్టి భానుమూర్తి స్వాగతోపన్యాసం చేశారు. ప్రవచనంలో భాగంగా వ్యాసుల వారు రచించిన అష్టాదశ మహా పురాణాలు మానవ శరీరంలోని అంగాలతో సమానమని మహేశ్వర శర్మ వివరించారు. నారదుల వారి కోసం చెప్పబడింది నారద పురాణమని, నవవిధ భక్తులు, భక్తుల యొక్క గుణగణాలు ఈ నారద పురాణంలో చెప్పడం జరిగిందన్నారు. భారత దేశం గొప్పతనాన్ని, సనాతన ధర్మ ప్రభావాన్ని, గృహస్థాశ్రమ సంప్రదాయాల్ని నారద పురాణంలో వ్యాస భగవానులు చక్కగా వివరించారని డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వొటారి చిన్న రాజన్న, శక్కరి వెంకటేశ్వర్, భోగ శ్రీధర్, రుద్ర సుధాకర్, వొడ్నాల రామారావు, వనపర్తి చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button