
viswatelangana.com
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి భీమారం, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ మండలాల పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు కోరారు. అనంతరం పౌరసరఫరాల కమిషనర్ చౌహన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ యస్మిన్ పాషా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగం జయంతి, డిసిఏస్ఓ జితేందర్ రెడ్డి, డి ఎమ్ జితేందర్ ప్రసాద్, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ, రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కోరారు. లారీల కొరత లేకుండా చూడాలని కోరుతూ లారీ ఓనర్ అసోసియేషన్ వారికీ, వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. అనంతరం జిల్లా పార బాయిల్డ్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు తో మాట్లాడి ధాన్యం బస్తాలను త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతే తనను సంప్రదించాలని పేర్కొన్నారు.