రోడ్లపై గుంతలు. లేచిన కంకరఅమ్మో తారు రోడ్డు అంటున్న వాహన చోదకులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దులూరు – బొమ్మెన – తక్కళ్లపెల్లి మధ్యలో ఉన్న తారు రోడ్డు అడుగుకో గుంత తో ఆధ్వాన్నంగా మారింది. రోడ్డు పైన కంకర బయటకు రావడంతో వాహన చోదకులు అమ్మో తారు రోడ్డు అంటూ వాహనాలు నడపడానికి భయపడుతున్నారు. అత్యవసర నిమిత్తం హాస్పిటల్ కు వెళ్లే వారు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. ఎంతలా పాడైందంటే వాహనం పై వెళ్లే వారికంటే నడుచుకుంటూ వెళ్లే వారే గమ్యానికి ముందుగా చేరుతున్నారు. ఏదైనా గ్రామంలో ప్రమాదం జరిగితే అంబులెన్సు కాని ఫైర్ ఇంజన్ కానీ దులూరు బొమ్మెన తక్కళ్లపెల్లి కి చేరాలంటే కొన్ని గంటల సమయం పట్టే పరిస్థితి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన తారు రోడ్లు మణ్ణాళ్ళ ముచ్చటగా తయారవుతున్నాయి. తారు రోడ్లపై తారు లేచి కంకర బయటకు రావడం, గుంతలు పడడంతో ప్రమాదాలు జరుగడంతో పాటు వాహనాలు కూడా మారమ్మత్తులకు గురవుతున్నాయని, మోటార్ సైకిళ్లకు పంక్చర్లు పడుతున్నాయని గ్రామస్తులు మాట్లాడుతూ దులూరు – బొమ్మెన – తక్కళ్లపెల్లి, మధ్యలో పాడైపోయిన తారు రోడ్డు అధికారులకు కనబడటం లేదా? మా సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఇకనైనా నాయకులు, అధికారులు స్పందించి దులూరు – బొమ్మెన-తక్కళ్లపెల్లి మధ్యలో ఉన్న తారు రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.



