అనాధ కుటుంబానికి ఆర్థిక సహాయం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన కొంతం లావణ్య (34) అనే మహిళ ఇటీవల క్యాన్సర్ బారిన పడి మరణించగా వారి కుటుంబం బజారున పడి దాతల కోసం వేచి చూస్తుంది. మృతురాలు గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు పొంది కొన్ని రోజులుగా పనిచేసి క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితమై దుర్భర జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యాధి తీవ్రతరమై ఇటీవలే మరణించడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆ కుటుంబ విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన తోటి ఉపాధిహామీ కూలీలు ఏకమై తలో కొంత జమ చేసిన రూ. 7500/-లను పని ప్రదేశం వద్ద మృతురాలి భర్త కొంతం రాములు కు గురువారం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కనిండని కడు పేదరిక కుటుంబాన్ని ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆదుకోని చేయూత నివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మృతురాలకు కూతురు కుమారుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు,ఫీల్డ్ అసిస్టెంట్, మెట్లు తదితరులు పాల్గొన్నారు.



