ఊట్ పల్లి లో ఘనంగా మల్లన్న జాతర

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఆదివారం రోజున బోనాలు సమర్పించగా మంగళవారం రోజున నాగెల్లి అగ్ని గుండాలు మరియు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఆదివారం రోజున ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని గ్రామం నుంచి ఊరేగింపుగా వెళ్లి మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు జరుగగా జాతరలో మరో ఘట్టం అగ్ని గుండం. మంగళవారం రోజున ఏర్పాటు చేసిన అగ్నిగుండాలు కణకణ మండే ఎర్రటి నిప్పుల మీద స్వామి వారి ప్రతిమలు పట్టుకుని భక్తులు నిప్పుల గుండం దాటి వెళతారు. మనసులో కోరిక కోరుకుని ఇలా చేస్తే నెరవేరుతుందని నమ్ముతారు. అలాగే భక్తుల కోరిక నెరవేరినందుకు గాను స్వామి వారికి మొక్కలు చెల్లించుకునేందుకు అగ్ని గుండం మీద నడుస్తారు. అందరి సమన్వయం తోనే జాతర విజయవంతం జరిగిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.




