సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్న కోరుట్ల మున్సిపాలిటీ

viswatelangana.com
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడంలో కోరుట్ల మున్సిపాలిటీ చురుకుగా వ్యవహరిస్తోంది. 100 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ గారు పట్టణంలోని 17, 18, 26వ వార్డులలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మురికి కాల్వలపై దోమల నివారణ స్ప్రే చేయడం, ఖాళీ కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, టైర్ పంచర్ల దుకాణాలలో ఉన్న పాత టైర్లలోని నీటిని బయటకు తీసివేయడం వంటి చర్యలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ గారు మాట్లాడుతూ దోమల బెడదను నియంత్రించడానికి ప్రజల సహకారం ఎంతో కీలకం. ప్రతి ఇంటిలో పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లు, నీటి డ్రమ్ములు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చు, అని తెలిపారు. తనిఖీల సందర్భంగా అనేక ఇళ్ల వద్ద పాత వస్తువుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమల లార్వా పెరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఆయన, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, అశోక్, మెప్మా సిబ్బంది, వార్డు ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.



