పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. సిపిఎం డిమాండ్

viswatelangana.com
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జి. తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం రోజున కోరుట్ల పట్టణ కేంద్రంలోని బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నందు గ్యాస్ సిలిండర్ లతో మరియు వంట పోయి తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై 50 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు, ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు, పెరిగే గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యవసర వస్తు ధరల పై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి, కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు, ఇప్పటికే ప్రజలకు ఉపాధి లేక ఆదాయం లేక నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతు వారి కొనుగోలు శక్తి క్షీణించిందని ధరలు పెంచుకుంటూ పోతే వారు జీవనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు లక్షల కోట్లు రుణాలు రాయితీలుగా ఇచ్చి ఆ భారాన్ని పేద ప్రజలపై మోపుతున్నదని విమర్శించారు. పెరిగిన గ్యాస్ ధరల వల్ల మహిళలపై తీవ్ర ప్రభావం పడుతుందని నారి శక్తి గురించి బీరాలు పలికే కేంద్ర పెద్దలు మహిళల గోడు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా ప్రజలు కూడా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్.మహిపాల్ నాయక్, నాయకులు కుంచం శంకర్, ఎంఎ.ఇబ్రహీం, రజియా సుల్తానా, బాబురావు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.



